: తిరుపతిలో నకిలీ పోలీసుల అరెస్టు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నకిలీ టాస్క్ ఫోర్స్ పోలీసులను అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఈరోజు వివరాలు తెలియజేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి లారీలు, ఆటో డ్రైవర్లను బెదిరించి ఒక ముఠా డబ్బు వసూలు చేసుకుంటోంది. తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు నిన్న రాత్రి చైతన్యపురం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఆటోను ఆపగా అందులోని వ్యక్తులు పరారయ్యేందుకు యత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ చేయగా పోలీసులమని చెప్పి వారు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితులు తిరుపతికి చెందిన విజయ్, షేక్ షౌకత్ అలీ, వెంకటేశ్, బాలరాజు, ఢిల్లీ రాజు. వీరిపై పాత కేసులు కూడా ఉన్నాయని తిరుపతి పోలీసులు పేర్కొన్నారు.