: జగన్ ఎప్పుడూ నవ్వుతాడు...అర్థమేమిటో... నాకు ఆశ్చర్యం వేస్తుంది !: సీఎం చంద్రబాబు
‘జగన్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు! ఎందుకో నాకు అర్థం కాదు... ఆశ్చర్యం వేస్తోంది’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభలో ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ, ‘పట్టిసీమ’ పూర్తి చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదని తెలిసినా కూడా రూ.1600 కోట్లు నీటిపాలు చేశారని ఆరోపించారు. అనంతరం, చంద్రబాబు స్పందిస్తూ, ‘రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది? అని అడిగినట్లు ఉంది. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా మంది ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మా పార్టీలో కూడా ఉన్నారు. గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. 8,500 క్యూసెక్కుల నీరు తీసుకొస్తున్నాం. జూన్ లో కృష్ణా డెల్టాలో పంటలు ప్రారంభమవుతాయి. రిజర్వాయర్ అవసరం లేదు. ఈ నీళ్లు సముద్రంలోకి పోవు. పోతాయని, ప్రతిపక్షసభ్యులు ఊహించుకున్నారు. కృష్ణా డెల్టాలో పంటకు 150 టీఎంసీలు నీరు కావాలి.. 170 టీఎంసీలు వాడాం. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో నీరు ఉంచుకుంటే కరవు అనేదే రాదు. ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెబితే, పట్టిసీమ ప్రాజెక్టు వేస్ట్ అని ప్రతిపక్షసభ్యులు అంటున్నారు. పట్టిసీమ గురించి తెలియకపోతే ప్రతిపక్షసభ్యులు తెలుసుకోవాలి. క్లాసులు తీసుకోమంటే తీసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో! మామూలుగా ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే.. నవ్వడం అలవాటైపోయి నవ్వుతాడు. లేకపోతే వెకిలి నవ్వులు నవ్వుతాడు. లేకపోతే ఏమీ తెలియనప్పుడు నవ్వుతాడు. నేను వైఎస్సార్సీపీ సభ్యులను అడుగుతున్నాను.. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్లీ చెబుతా. మీ అందరికీ పాఠాలు అర్థం కావాలి. రాయలసీమలో ఉండేవారు గోదావరి చూసి ఉండరు. మీరందరూ వెళ్లి గోదావరి చూడాలి. పుష్కరాలకు వెళితే పుణ్యం అన్నా వచ్చేది. అది కూడా మీరు చేయలేదు’ అంటూ చంద్రబాబు నవ్వుతూ చురకలంటించారు.