: శిల్పా వర్సెస్ భూమా!... పేలుతున్న మాటల తూటాలు
శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి... కర్నూలు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య ఆది నుంచి వైరమే. గతంలో భూమా టీడీపీలో, శిల్పా సోదరులు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసిన భూమా... తొలుత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన శిల్పా బ్రదర్స్ ‘సైకిల్’ ఎక్కేశారు. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ...ఇటీవలే ‘ఆకర్ష్’కు తెర లేపింది. ఈ క్రమంలో నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు అఖిలప్రియతో కలిసి వైసీపీకి ఝలక్కిస్తూ టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా శిల్పా బ్రదర్స్ ... భూమా చేరికను అడ్డుకునేందుకు శాయశక్తులా యత్నించారు. అయితే సర్దుకుపోవాలన్న పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సూచనతో కాస్తంత వెనక్కు తగ్గి భూమాకు స్వాగతం పలికారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం మాత్రం అలానే ఉండిపోయింది. నిన్న రాత్రి నంద్యాలలో శిల్పా అనుచరుడు తులసిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంతో ఒక్కసారిగా వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. దాడికి పాల్పడింది భూమా వర్గమేనని ఆరోపించిన శిల్పా మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాదు వచ్చి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో భూమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడుల సంస్కృతి ఉన్న భూమా చేరికతో టీడీపీలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. అంతేకాక భూమా తమను అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని, తాము మాత్రం తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు. శిల్పా వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన భూమా కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన శిల్పా బ్రదర్స్... వారి హయాంలో జరిగిన వ్యవహారాలపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. శిల్పా లాంటి నీచమైన చరిత్ర తనది కాదని కూడా భూమా వ్యాఖ్యానించారు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు పరస్పర ఆరోపణలు సంధించుకుంటున్న వ్యవహారం కర్నూలు జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.