: కొత్త జలమార్గంతో... పత్తి రైతుకు లాభాల పంటే!: కృష్ణపట్నం సీఈఓ అనిల్ యెండ్లూరి
భారత్, బంగ్లాదేశ్ ల మధ్య తెరచుకున్న కొత్త జల మార్గం పత్తి రైతులకు లాభాల పంటేనని కృష్ణపట్నం పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ యెండ్లూరి అన్నారు. నిన్న బంగ్లాదేశ్ ఓడరేవు నుంచి వచ్చిన ‘నీపా పరిబహాన్’ సంస్థకు చెందిన ఎంవీ హార్బర్ -1 నౌకలో పత్తి బేళ్ల లోడింగ్ ను నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకితో కలిసి అనిల్ యెండ్లూరి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో 42 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం ఇప్పుడు అమల్లోకి రావడం హర్షణీయమన్నారు. ఈ కొత్త జలమార్గంతో తెలుగు రాష్ట్రాల్లోని పత్తి రైతులకు మరింత మంచి ధరలు లభించనున్నాయన్నారు. నిన్నటిదాకా కృష్ణపట్నం నుంచి బయలుదేరే నౌకలు బంగ్లాదేశ్ చేరుకోవాలంటే 25 రోజుల నుంచి 30 రోజులు పట్టేదని ఆయన అన్నారు. కొత్త జలమార్గంతో ఈ ప్రయాణం కేవలం ఐదు రోజులకు తగ్గిపోయిందన్నారు. దూరం తగ్గిన నేపథ్యంలో రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయని, వెరసి రైతుకు మంచి ధర లభించనుందని అనిల్ యెండ్లూరి వ్యాఖ్యానించారు. ఇక మిరప, పప్పు దినుసులను కూడా బంగ్లాకు సులువుగానే ఎగుమతి చేసే అవకాశం చిక్కిందన్నారు. మరోవైపు బంగ్లాలో తయారయ్యే జనపనార బస్తాలు త్వరితగతిన అందుబాటులోకి రానున్నాయన్నారు. చారిత్రక ఒప్పందం అమలులో భాగంగా తొలి అడుగు తమదే కావడం గర్వ కారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.