: కర్నూలులో ఫ్యాక్షన్ రాజకీయం... శిల్పా వర్గీయుడిపై భూమా అనుచరుల హత్యాయత్నం


ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. ఈ సామెత ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. నిన్న రాత్రి శిల్పాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కొత్తపల్లి సర్పంచ్ తులసిరెడ్డిపై భూమా వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తులసిరెడ్డి కోసం మాటు వేసిన భూమా వర్గానికి చెందిన బాలనాగిరెడ్డి, మరికొంత మంది... ఆయన కళ్లల్లో కారం చల్లి ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తులసిరెడ్డిని తొలుత కర్నూలు జనరల్ ఆసుపత్రి, ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తులసిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. దాడిపై వెనువెంటనే స్పందించిన తులసిరెడ్డి వర్గీయులు భూమా వర్గమే ఈ దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమా అనుచరుడు బాలనాగిరెడ్డి సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలింపు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిల్పా మోహన్ రెడ్డి... తులసిరెడ్డిపై భూమా వర్గమే దాడి చేసిందని ఆరోపించారు. అంతేకాక ఈ దాడికి సంబంధించి భూమా వర్గంపై పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా భూమా వర్గం వాదిస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆ వర్గం చెబుతోంది. ఈ దాడితో నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తపల్లిలో తులసిరెడ్డి వర్గీయులు ఎక్కడ ప్రతిదాడులకు దిగుతారోనన్న అనుమానంతో పోలీసులు కొత్తపల్లిలో పికెట్ ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News