: పీఏసీ పదవికి సరిపోనట!...మరి ఉపనేతగా ఎలా సరిపోతాను?: జ్యోతుల ఆవేదన


సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా ఎదిగిన జ్యోతుల నెహ్రూ తనకు వైసీపీలో జరిగిన అవమానంపై ఎట్టకేలకు నోరు విప్పారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని తన సొంతూరు ఇర్రిపాకలో నిన్న ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు జరిగిన అవమానంపై ఆవేదన వ్యక్తం చేశారు. "పీఏసీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబుతో సూటిగా మాట్లాడాలని, ఆ పదవికి నేను సరిపోనని జగన్ అనడం బాధ కలిగించింది. మరి వైసీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఎలా సరిపోతాను? 59 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలు పీఏసీ చైర్మన్ పదవిని నాకే ఇవ్వాలని ప్రతిపాదించారు. జగన్ మూర్ఖంగా మరొకరికి పదవి ఇవ్వడం దురదృష్టకరం" అని నెహ్రూ కార్యకర్తల ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇక తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరందుకోగానే... ముందూ వెనుకా చూసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవి, అసెంబ్లీలో ఫ్లోర్ ఉప లీడర్ పదవులను వేరొకరికి కేటాయించాలని పార్టీ నేతలు సాయిరెడ్డి, భాస్కరరెడ్డికి జగన్ సూచించారని... దీనిని అస్సలు తట్టుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు. "ఇవన్నీ నన్ను కుంగదీశాయి. మనస్తాపంతోనే వైసీపీ వీడి... టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన తన కార్యకర్తలకు చెప్పారు.

  • Loading...

More Telugu News