: జగన్ తో భేటీ ముగియగానే... చంద్రబాబు వద్దకెళ్లనున్న జ్యోతుల?
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ... పార్టీ అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు భారీ షాక్ నే ఇవ్వనున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు దాదాపుగా నిర్ణయించుకున్న జ్యోతుల ఆ విషయాన్ని నేరుగా పార్టీ అధినేతకు ముఖం మీదే చెప్పనున్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంతూరు ఇర్రిపాక నుంచి బయలుదేరి హైదరాబాదు చేరుకున్న జ్యోతుల... నేటి ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో జగన్ తో భేటీ కానున్నారు. పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను జగన్ ముందు ప్రస్తావించనున్న జ్యోతుల... పార్టీ మారక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పనున్నారు. జగన్ తో భేటీ ముగియగానే జ్యోతుల తన తోడల్లుడు, మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో కలిసి నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో సమావేశం కానున్నట్లు సమాచారం. అంతేకాక టీడీపీలో చేరే తేదీని కూడా జ్యోతుల నేడే ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది.