: పడగొడతానన్నారు... పడిపోయారు: జగన్ పై గోరంట్ల విసుర్లు
టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతానంటూ నాడు వ్యాఖ్యానించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పడిపోయారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి అన్నారు. వైఎస్సార్సీపీ నేతల వలసలపై ఆయన స్పందించారు. ప్రతిపక్ష పార్టీకి భవిష్యత్ ఉండదనే భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. లోకేశ్ సారథ్యంలో రివ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి? ఏ విధంగా బలోపేతం చేయాలి? షెడ్యూల్ ప్రకారం గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మొదలైన కమిటీలు ఎలా పని చేస్తున్నాయి? అన్న వాటిపై ఈ రోజే తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం నిర్వహించామన్నారు. ఇటీవల మరణించిన తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేత చిట్టిబాబు స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేల చేరికల కోసం తామేమి సమావేశాలు నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని, నియోజకవర్గాలను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడి మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని, చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు వారు ఆకర్షితులవుతున్నారని, అందుకే తమ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి బయటపడాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారని, ఆ పార్టీ అధినేత మారడని, ఆయన విధానాలు మారవని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అంటున్నారని అన్నారు. శాసనసభా సమావేశాల తర్వాత పెను మార్పులు సంభవించే అవకాశముందని తాను భావిస్తున్నానని బుచ్చయ్య చౌదరి అన్నారు.