: జగన్ కు ఝలక్కిచ్చిన అచ్చెన్న!... కరెంట్ ను తక్కువ ధరకు జగన్ ఇచ్చినా కొంటామని కౌంటర్!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోమారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కిచ్చారు. విద్యుత్ ధరల పెంపుపై జగన్ విసిరిన ఆరోపణలకు సమాధానమిచ్చిన సందర్భంగా అచ్చెన్న తనదైన శైలిలో విపక్ష నేతపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అచ్చెన్న తెలిపారు. రెండేళ్లలోనే రాష్ట్రంలో విద్యుత్ కొరతను పరిష్కరించామన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే... అధిక ధరలు ఎందుకు చెల్లిస్తామని అచ్చెన్న ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ కు పవర్ ప్రాజెక్టులున్న విషయాన్ని ప్రస్తావించిన అచ్చెన్న... విద్యుదుత్పత్తి కంపెనీల ఇబ్బందులు తమకంటే జగన్ కే బాగా తెలుసునని చురకలంటించారు. ఈ క్రమంలో పవర్ ప్రాజెక్టులున్న జగన్ తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామంటే తాము తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నామని అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు.