: ఏపీలో సినిమాలు తీయండి...ఎన్నో రాయితీలు ఉన్నాయి: చంద్రబాబు
రాజకీయ మీటింగ్ లు తమకు సర్వసాధారణమని, సినిమా ఫంక్షన్లు ప్రత్యేకమని...సినిమా కార్యక్రమాల్లో ఉప్పొంగే ఉత్సాహం ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన 'రాజా చెయ్యివేస్తే' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లా అంటే నందమూరి తారకరామారావు గారు గుర్తుకువస్తారని అన్నారు. రోహిత్ మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడని అభినందించారు. తమ కుంటుంబానికి సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లని ఆయన చెప్పారు. తమ కుటుంబం రాజకీయ కుటుంబంగా ఉన్నప్పటికీ రోహిత్ తో సినీ కుటుంబంగా మారిందని ఆయన తెలిపారు. తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండా పట్టుకుని స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ రోజు రాజధానికి వెళ్లినప్పుడు 755 సంవత్సరాలకు ముందు రాణిరుద్రమదేవి ఏర్పాటు చేసిన స్థూపం దగ్గరకు అధికారులు తీసుకెళ్లారని ఆయన అన్నారు. అలాగే ఆమె పట్టాభిషేకం జరిగిన రోజు ఈ రోజేనని ఆయన అన్నారు. దేశంలో నెంబర్ వన్ రాజధానిగా అమరావతి వెలుగొందుతుందని ఆయన తెలిపారు. అంత మంచి రోజైన ఈ రోజు ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 'మా కుటుంబ సభ్యులు ఏ సినిమాలో నటించినా అది సక్సెస్ కావాలని కోరుకునే వారిలో నేను మొదటి వాడిన'ని ఆయన చెప్పారు. గతంలో సినిమా అభిమానులు కూడా తన అభిమానులుగా ఉండేవారని, ఇప్పుడు వారంతా రోహిత్ కు ఫ్యాన్స్ అయ్యారని ఆయన తెలిపారు. తెలుగులో వచ్చే కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయని, మరికొన్ని సినిమాలు నిద్రరానివ్వడం లేదని...అలాంటి సినిమాల వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయని ఆయన సూచించారు. మంచి సినిమాలు తీయడం నిర్మాతలు అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలుగు సినిమాలకు ఒక చరిత్ర ఉందని ఆయన చెప్పారు. సినిమా భవిష్యత్ మరింత విస్తృతమవుతోందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా 9,000 వేల కోట్ల రూపాయల సినీ వ్యాపారం జరుగుతుందంటే సినిమాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఏపీలో సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సినీ పరిశ్రమ పెద్దలు ఏపీలో సినిమాలు తీసేందుకు వస్తే రాయితీలు ఇస్తామని ఆయన తెలిపారు.