: పాకిస్థాన్ లో ఉన్నామా? సిరియాలో ఉన్నామా?: హెచ్సీయూ స్టూడెంట్ తల్లి ప్రశ్న
మనం పాకిస్థాన్ లో ఉన్నామా? సిరియాలో ఉన్నామా? అని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తిరువనంతపురంకి చెందిన విద్యార్థి తల్లి ప్రశ్నించారు. తిరువనంతపురంలో ఆమె మాట్లాడుతూ, హెచ్సీయూలో చోటుచేసుకున్న ఘటనలతో తన కుమారుడిని వారం రోజుల క్రితం అరెస్టు చేశారన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు కానీ, యూనివర్సిటీ అధికారులు కానీ ఎందుకు సమాచారం అందించలేదని ఆమె నిలదీశారు. గత మంగళవారం నుంచి తమ కుమారుడు తమతో మాట్లాడలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని ఆమె చెప్పారు. కుమారుడి నుంచి సమాచారం ఆందకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో వారికి ఎలా తెలుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ కుమారుడిని ఏం చేశారో తెలియక ఎంత ఆందోళన చెందామో ఊహించాలని ఆమె కోరారు.