: త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి వెళ్లి అనుకున్నది సాధించిన తృప్తి దేశాయ్
ఆలయాల గర్భగుడుల్లోకి మహిళలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ అనుకున్నది సాధించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రమైన నాసికా త్రయంబకేశ్వరుని ఆలయంలోకి కొంతమంది అనుచరులతో కలసి వెళ్లిన ఆమె, సరాసరి గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేశారు. నాసిక్ లోని స్థానిక మహిళలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆమె తన పంతం నెగ్గించుకున్నారు. అందరు మహిళలకూ గర్భగుడి ప్రవేశం కల్పించాలని స్వామిని వేడుకున్నట్టు ఆమె చెప్పారు. ఈ విషయంలో ఆలయ ట్రస్టీ స్పందిస్తూ, మహిళల ప్రవేశంపై ఆంక్షలు సంప్రదాయాల మేరకు వచ్చిన కట్టుబాట్లేనని వ్యాఖ్యానించారు.