: ఉష్ణతాపాన్ని తప్పించుకునేందుకు అందరికీ ఉపయోగపడే మార్గాలు!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలైతే బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. సాయంత్రం 5 గంటల సమయంలోనూ సూర్యుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటేనే వేసవి తాపాన్ని తట్టుకోగలరని అంటున్నారు. వేడి అధికంగా ఉన్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు... * సాధ్యమైనంత వరకూ చల్లటి ప్రదేశాల్లోనే ఉండాలి. * మధ్యాహ్న సమయంలో బయటకు కదలకుంటేనే మేలు. * ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, కళ్లద్దాలు, టోపీ, గొడుగు వంటివి తప్పనిసరి. * ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. * శరీరానికి అతుక్కునే బిగుతు దుస్తుల బదులు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. * ఎండలో బైకులపై వెళ్లేవారు హెల్మెట్, గ్లౌజులు వాడాలి. * తీసుకునే ఆహారంలో ఉప్పు, పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. * మధ్యాహ్నం వేళల్లో పిల్లల్ని ఇంట్లోనే ఆడుకోమని సలహా ఇవ్వాలి. * సాయంత్రం మాత్రమే మైదాన క్రీడలకు పంపాలి. * బయటి చిరుతిళ్లు తీసుకోకపోవడమే ఉత్తమం. * పిల్లలకు రెండు పూటలా స్నానం చేయించాలి. * ఈత కొలనులకు పంపాలంటే, శుభ్రమైన నీరు, నిపుణులు ఉన్నారని నిర్ధారించుకున్నాకే పంపండి. * నిల్వ ఉన్న శీతల పానీయాలు, ఆహారం తీసుకోవద్దు. * బయట ఐస్ కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలి. * పిల్లలకు గుర్తు చేసి మరీ ఎక్కువసార్లు నీటిని తాగించాలి. * చిన్నారులకు పళ్లరసాలు, చిటికెడు ఉప్పు వేసిన మజ్జిగ అధికంగా ఇవ్వాలి. * సమతుల ఆహారం తీసుకోవాలి. * పెసరపప్పు, క్యారెట్, ఆకుకూరలు అధికంగా తింటే మేలు. * గుమ్మడి, పొట్లకాయ, దోసలకు ప్రాధాన్యం ఇవ్వండి. * సమోసా, చిప్స్, వడలు తదితరాలకు దూరంగా ఉండాలి. * కలుషిత జలాలతో చేసే పానీపూరీ, కట్ లెట్ల జోలికి పోవద్దు. * మద్యం, ధూమపానం, అధికంగా కాఫీ తాగే అలవాటు మానుకోవాలి. * సబ్జా గింజలు నానబెట్టి తింటే శరీరానికి ఎంతో ఉపశమనం. * నిమ్మరసం, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. * బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు తప్పనిసరిగా వెంట ఉంచుకోండి. * రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి.