: మోదీని టార్గెట్ చేసిన కన్నయ్య...ప్రధానికి సూటి ప్రశ్నలు


జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ నాయకుడు కన్నయ్య కుమార్ తొలిసారి పూర్తిస్థాయి రాజకీయ ప్రసంగం చేశారు. విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు ప్రశ్నించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. మోదీ ప్రధాని కాకముందు 'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎప్పుడూ మౌనంగా ఉంటున్నారు. ఆయన మ్యూట్ ప్రధాని' అని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లో ఉంటున్నారు. దీనిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. టీవీ, రేడియోల ద్వారా మన్ కీ బాత్ చెప్పే ప్రధాని మోదీ...ప్రజల మన్ కీ బాత్ పట్టించుకోవడం మానేశారని అన్నారు. దేశంలో టీకొట్టులో పని చేసే వ్యక్తి ఎవరైనా పది కోట్ల రూపాయల సూట్ ధరించారా? అని ఆయన మోదీని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రధాని ఏఏ ప్రాంతాల్లో ఏఏ హామీలిచ్చారో ఓ సారి వీడియోలు పరిశీలించాలని ఆయన సూచించారు. అలా చేస్తే అయినా ప్రధానికి తానేం మాట్లాడానో, తానేం చేస్తున్నానో తెలిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ లో కేవలం ఐదు శాతం మాత్రమే ప్రజా సంక్షేమానికి కేటాయించారని ఆయన విమర్శించారు. మరో ఏడు శాతం ప్రజోపయోగమైన కార్యక్రమాలకు వినియోగించారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన బడ్జెట్ మొత్తం ఎవరి కోసం కేటాయించారో చూడాలని ఆయన సూచించారు. ప్రజలతో బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించిన మోదీ...అలా సమకూరిన డబ్బును ఏం చేశారని అడిగారు. కష్టం ప్రజలది...లాభం బ్యాంకులకా? అని ఆయన నిలదీశారు. ఇలా చేసే మాల్యాను వేల కోట్ల రూపాయలతో విదేశాలకు పంపారని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా చేస్తూ ఉంటే ప్రజలు ఏదో ఒకరోజు దేశం కోసం ఏం చేశారు మోదీజీ? అని అడుగుతారని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News