: నా విడాకులకు కారణం అదే!: దర్శకుడు వర్మ
తన వ్యాఖ్యలు, ట్వీట్ల ద్వారా తాను చెప్పదలచుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, తన భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నాననే విషయాన్ని తాజాగా ప్రస్తావించారు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎటాక్' చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఆ కార్యక్రమంలో వర్మ తన విడాకుల గురించి మాట్లాడుతూ, నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తన భార్యకు గజల్స్ అంటే ఇష్టమని, తనకు మాత్రం అవి అసలు నచ్చవని, ఇళయరాజా సంగీతం వినేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు. తను రాత్రి పూట గజల్స్ ప్లే చేసేదని, తానేమో తనకు ఇష్టమైన పాటలు వినాలనుకునేవాడినని, కాలక్రమంలో ఇదే తమ విడాకులకు ఒక కారణమైందని వర్మ పేర్కొన్నారు. అయితే, గజల్ శ్రీనివాస్ తో తనకు పరిచయం ఏర్పడిన తర్వాత ‘గజల్’పై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని ఆర్జీవీ తెలిపారు.