: నేను నటిస్తానన్నా...కార్తీ మాత్రం నో చెబుదామనుకున్నాడు!: నాగార్జున
ఫ్రెంచ్ సినిమా 'ది ఇన్ టచ్ బుల్స్' ఆధారంగా రూపొందిన 'ఊపిరి' సినిమా అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని ప్రముఖ నటుడు నాగార్జున తెలిపారు. 'ఊపిరి' ప్రమోషన్ సందర్భంగా ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఫ్రెంచ్ సినిమా సీడీని దర్శకుడు వంశీ పైడిపల్లి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, ఈ పాత్రను పోషిస్తాను కానీ, తెలుగు నేటివిటీకి అనుగుణంగా బాగా మార్చాలని చెప్పానని అన్నారు. దీంతో ఆరు నెలల విరామం తరువాత దానిని అద్భుతమైన విధంగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారని చెప్పారు. మన నేటివిటీకి అనుగుణంగా మార్చిన విధానం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. తనలాగే కార్తీకి కూడా ముందు సీడీ ఇచ్చారని, ఆ సీడీని చూసిన కార్తీకి అది నచ్చలేదని, అయితే ఆ తర్వాత వంశీ పైడిపల్లి కథ చెప్పిన విధానం నచ్చి కార్తీ నో అనలేకపోయాడని అన్నారు. ఈ కథ ఎవరిని చేరాలో వారిని చేరిందని, అభిమానులను తప్పకుండా అలరిస్తుందని ఆయన అన్నారు. విభిన్నంగా ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారని, 'ఊపిరి'ని కూడా ఆదరిస్తారని నాగార్జున ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.