: డబ్బులొద్దు బంగారమే ఇవ్వమంటున్న టీటీడీ!


బంగారం నగదీకరణ పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారానికి బదులుగా డబ్బులొద్దని, తమకు తిరిగి బంగారమే ఇవ్వాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. మూడేళ్లకు పైబడి ఉన్న లాంగ్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి టీటీడీ బంగారం డిపాజిట్ చేసిన దానికి రీ పేమెంట్ కింద తిరిగి బంగారమే ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాంబశివరావు పేర్కొన్నారు. ఈ పథకంలోని కొన్ని షరతులను మార్చమని కోరుతూ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. మీడియమ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన బంగారానికి అసలు, వడ్డీ కూడా బంగారం రూపంలోనే ఇవ్వాలని కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నామన్నారు. సూచించిన మార్పులు కనుక చేస్తే దేశంలోని అన్ని దేవాలయాలు ఈ పథకంపై ఆసక్తి చూపుతాయని సాంబశివరావు అన్నారు. టీటీడీ గత నెలలో 1.3 టన్నుల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసిందని, ఈ బంగారానికి 1.75 శాతం వడ్డీ మూడేళ్ల పాటు వర్తిస్తుందన్నారు. వచ్చే రెండు వారాల వ్యవధిలో టీటీడీ మరో 1.4 టన్నుల బంగారాన్ని1.25 శాతం వడ్డీపై ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు సాంబశివరావు పేర్కొన్నారు. కాగా, ఏపీలోని ఆలయాల్లో సుమారు 7 టన్నుల బంగారం వరకూ ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ బంగారం విలువ 1828 కోట్లకు పైమాటే.

  • Loading...

More Telugu News