: బస్సు కండక్టర్ వేధింపులను తప్పించుకునేందుకు డోర్ తెరచుకుని దూకేసిన బాలిక!
9వ తరగతి చదువుతున్న ఓ బాలిక రోజులాగే స్కూలుకు వెళ్లేందుకు బస్సు ఎక్కి భయంకర అనుభవాన్ని చవిచూసింది. వేధింపులకు దిగిన కండక్టర్ బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు డోర్ తెరచుకుని బయటకు దూకింది. ఈ ఘటన గుజరాత్ లోని మహేసనా సమీపంలో జరిగింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈశ్వర్ భాయ్ పార్మర్ (45) అనే వ్యక్తి జీఎస్ఆర్టీసీ నడుపుతున్న హలోల్ - వాద్ నగర్ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత బాలిక, మహేసనా వెళ్లేందుకు పటియా గ్రామంలో బస్సు ఎక్కింది. ఆ బస్సులో ఇద్దరంటే ఇద్దరే ప్రయాణికులు ఉండటంతో భయంతో సీట్లో కూర్చోకుండా, డోర్ వద్దే నిలబడింది. ఇక అప్పుడు కండక్టర్ లోని మానవ మృగం బయటకు వచ్చింది. ఆమెను కూర్చోవాలని కామెంట్లు మొదలు పెట్టాడు. లైంగిక వేధింపులకు దిగాడు. వేధింపుల తీవ్రత పెరగడంతో, బస్ వేగంగా వెళుతున్న సమయంలోనే డోర్ తీసుకుని బయటకు దూకేసింది. తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోందని, ఈశ్వర్ భాయ్ పై కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.