: స్పైస్ జెట్ హోలీ సంబరం!... ప్రయాణికులను స్టెప్పులతో హోరెత్తించిన ఎయిర్ హోస్టెస్ లు


విమానయాన రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతూనే... ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లను ఇస్తున్న స్పైస్ జెట్... హోలీ సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హోలీ పర్వదినానికి ఓ రోజు ముందుగా మంగళవారం తన విమానాల్లో ఎక్కిన ప్రయాణికులకు ప్రవేశ ద్వారం వద్దే ఆత్మీయ స్వాగతం పలికిన ‘స్పైస్ జెట్’ ఎయిర్ హోస్టెస్ లు ప్రయాణికుల నుదుట తిలకం దిద్దారు. ఆపై ప్రయాణికులను వారి సీట్ల వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఎయిర్ హోస్టెస్ లు... ఆ తర్వాత బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనువిందు చేశారు. ఎయిర్ హోస్టెస్ ల స్టెప్పులతో మైమరచిన ప్రయాణికులు కొందరు వారితో కలిసి స్టెప్పులేశారు. గతేడాది మిడ్ ఎయిర్ లో హోలీ వేడుకలకు తెర తీసిన స్పైస్ జెట్ సిబ్బంది... ఈ ఏడాది మాత్రం విమానం టేకాఫ్ తీసుకోకముందే సందడి షురూ చేశారు. ఇక మెనూ కార్డులకూ రంగులద్ది ప్యాసెంజర్లకు అందించారు. ఈ వినూత్న వేడుకలకు సంబంధించిన వీడియోను నేటి ఉదయం స్పైస్ జెట్ విడుదల చేసింది. ఈ వీడియో నేషనల్ మీడియాలోనే కాక రీజనల్ న్యూస్ ఛానెల్స్ లోనూ హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News