: నిర్మాత సంతకం ఫోర్జరీ చేసి సినిమానే అమ్మేసి బుక్కయిన తెలుగు డైరెక్టరు!
సినిమా నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన నిర్మాత సంతకాన్ని ఫోర్జరీ చేసి అమ్మేశాడు అదే చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ కు చెందిన నిర్మాత జానా రామారావు 'అమ్మాయిలూ టేక్ కేర్' అనే చిత్రాన్ని మహంతి పద్మారావు అనే దర్శకుడితో తీయించారు. చిత్రం విడుదల సమయంలో రామారావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన పద్మారావు, చిత్రం హక్కులను సతీష్ చౌదరి అనే వ్యక్తికి విక్రయించాడు. ఆపై సతీష్, పద్మారావు కలిసి చిత్రం పేరును 'వాడు వీడు... ఓ కల్పన' అని మార్చేసి, పది రోజుల క్రితం ఆడియోను కూడా విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న రామారావు ఫిర్యాదు మేరకు పద్మారావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు పంపారు. సినిమా హక్కులు కొనుగోలు చేసిన సతీష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.