: టికెట్ లేకుండా రైలెక్కి, మాల్యాను తీసుకొస్తేనే ఫైన్ కడతానని 12 గంటలు వాదించిన ముంబై మహిళ!


ముంబై సబర్బన్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ కావాలనే టికెట్ తీసుకోకుండా వచ్చి ప్రయాణించడంతో పాటు చెకింగ్ అధికారులు జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన మాల్యాను తెచ్చి ఆ డబ్బు కక్కిస్తేనే ఫైన్ కడతానని భీష్మించుకుని కూర్చుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆర్థికంగా ఉన్నత స్థితిలోనే ఉన్న ప్రేమలతా భన్సాలీ (44) సౌత్ ముంబైలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఇటీవల టికెట్ కొనకుండా రైలెక్కిన ఆమె, మహాలక్ష్మి స్టేషన్ వద్ద పట్టుబడ్డారు. రూ. 260 జరిమానా వేసిన అధికారులు, దాన్ని కట్టాలని కోరితే, మాల్యాతో డబ్బు కట్టించాకే తనను అడగాలని వాదించారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు కాదు, ఏకంగా 12 గంటల పాటు అధికారులతో, పోలీసులతో వాదించారు. చివరకు ఆమె భర్తకు సమన్లు జారీ చేసి పిలిపించినా, మెట్టు దిగలేదు. మాల్యాను ఏమీ అనకుండా తనలాంటి వారిని వేధిస్తున్నారని వ్యవస్థలోపాలను ఎత్తి చూపారు. చివరకు ఆమెను కోర్టుకు తీసుకెళ్లగా, జైలుకైనా వెళతానని, జరిమానా కట్టబోనని స్పష్టం చేశారు. దీంతో ఆమెకు వారం రోజుల జైలుశిక్ష విధించినట్టు వెస్ట్రన్ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా వెల్లడించారు. ఆమె వద్ద డబ్బు లేదనుకుని కనీసం ఎంతో కొంత మొత్తం చెల్లించి వెళ్లిపోవాలని కోరినా ఆమె అంగీకరించకుండా జైలుకు వెళ్లిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News