: హైదరాబాదులో కన్నయ్య కాక!... హెచ్ సీయూ కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం


దేశవ్యాప్తంగా పెను చర్చకు తెర తీసిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ నేడు హైదరాబాదు రానున్నారు. పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరిని నిరసిస్తూ జేఎన్ యూలో నిర్వహించిన ర్యాలీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న కారణంగా కన్నయ్య సహా మరో ఐదుగురు విద్యార్థులపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జేఎన్ యూ నిప్పుల కుంపటిలా మారింది. తాజాగా హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి అతడి తల్లి నేడు వర్సిటీలో దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపేందుకు కన్నయ్య హైదరాబాదు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హెచ్ సీయూ వీసీ పొదిలె అప్పారావు చాలాకాలం తర్వాత విధుల్లో చేరడం, విద్యార్థులు అడ్డుకోవడంతో వర్సిటీ రణరంగంగా మారింది. ఈ క్రమంలో కన్నయ్య కూడా వర్సిటీలో అడుగుపెడితే పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కన్నయ్యను వర్సిటీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇదిలా ఉంటే... రేపు కూడా హైదరాబాదులోనే ఉండే కన్నయ్య కుమార్ రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మరో కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News