: హెచ్సీయూలో రసవత్తర పోరు...విద్యార్థులు వర్సెస్ సిబ్బంది
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సిబ్బంది వర్సెస్ స్టూడెంట్స్ పోరాటంగా మారింది. రేపటి నుంచి హెచ్సీయూలోని విద్యార్థులు నివాసముంటున్న హాస్టల్స్ కి తాగునీరు, విద్యుత్, భోజన సౌకర్యాలు అందకుండా నిలిపేస్తున్నామని సిబ్బంది ప్రకటించారు. కాగా, రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం సుదీర్ఘ సెలవుపై వెళ్లిన హెచ్సీయూ వీసీ అప్పారావు తిరిగి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వస్తూనే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తో సమావేశం నిర్వహించగా, అక్కడికి చేరుకున్న విద్యార్థులు వీసీని వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, విద్యార్థులు... వీసీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అక్కడి ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వీసీ ఇంటివద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది.