: డిప్యూటీ మేయర్ పోస్టుకు రూ.కోటి అడిగారు!... జగన్ పార్టీపై వైఎస్ మేనత్త కొడుకు సంచలన ఆరోపణ
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలకిచ్చిన ఆయన మామ పీటర్ (దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా మేనత్త కొడుకు) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా వైసీపీలోనే ఉన్న పీటర్... కడప కార్పొరేషన్ లోని 23 వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. నిన్న హైదరాబాదు వచ్చిన ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ పార్టీ నేతలపై పీటర్ సంచలన ఆరోపణలు చేశారు. కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం వెళ్లిన తనకు పార్టీ నేతలు దిమ్మ తిరిగే ప్రతిపాదనను ముందు పెట్టారని ఆయన ఆరోపించారు. రూ.కోటి ఇస్తే డిప్యూటీ మేయర్ పదవి గురించి ఆలోచిస్తామంటూ వైసీపీ నేతలు చెప్పడంతో తాను మిన్నకుండిపోయానని ఆయన తెలిపారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం నామినేషన్ వేస్తే.. ఒత్తిడి తెచ్చి మరీ ఉపసంహరించుకునేలా చేశారని పీటర్ ఆరోపించారు. కొన్ని డివిజన్లకు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల మేర పనులు కేటాయించి, తన డివిజన్ కు మాత్రం రూ.18 లక్షలు మాత్రమే విడుదల చేశారన్నారు. తన సోదరుడు ఎఫ్ సీఎస్ పీటర్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండేవారని, అయితే టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత ఆయనను మార్చాలని కొందరు యత్నించగా, చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారన్నారు. తన సోదరుడిని ప్రభుత్వ సలహాదారుగానే కొనసాగించారన్నారు. ఇక పులివెందులలోని వైఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు ఎయిడ్ ఇవ్వడంతో పాటు 125 పోస్టులను ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని పీటర్ పేర్కొన్నారు. క్రిస్టియన్లకు టీడీపీ హయాంలోనే గుర్తింపు లభించిందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని పీటర్ చెప్పారు.