: కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చి వివాదం రేపిన శశిథరూర్
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చుతూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఈ రోజు జేఎన్యూకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, 'కన్నయ్య కుమార్ లాంటి వారు దేశద్రోహం కేసులో నిందితులుగా ఉన్నారు. నిజం చెప్పాలంటే, కన్నయ్య కుమార్ ఈ కాలపు భగత్ సింగ్' అన్నారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలన కాలంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి వారు రాజద్రోహం నేరంపై అరెస్టులు కాబడ్డవారేనని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తిని.. దేశద్రోహం నేరంపై అరెస్టు కాబడిన వ్యక్తితో పోలుస్తారా? అంటూ మండిపడుతున్నారు.