: అమితాబ్ సొంతంగా రూ.30 లక్షలు ఖర్చు పెట్టారు... మా నుంచి ఒక్క రూపాయీ తీసుకోలేదు: సౌరవ్ గంగూలీ
టీ20 ప్రపంచకప్ పోరులో భాగంగా శనివారం భారత్-పాక్ టీ20 మ్యాచ్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ సందర్భంగా ఆయన ఆలపించిన జాతీయ గీతానికి గానూ బిగ్ బీ భారీ పారితోషికం తీసుకున్నారన్న ఆరోపణలను భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఖండించారు. అమితాబ్ దేశభక్తితోనే జాతీయగీతం పాడారని ఆయన అన్నారు. ఇందుకోసం తమ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వివరించారు. అంతేగాక, అమితాబ్ ఒక స్పెషల్ పర్సన్ అని, ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటానని గంగూలీ పేర్కొన్నారు. విమాన టిక్కెట్లు, హోటల్ ఖర్చు అన్నిటికీ అమితాబే స్వయంగా రూ.30 లక్షల ఖర్చు భరించుకున్నారని తెలిపారు. పాట పాడినందుకు పారితోషికం తీసుకోవాలని అమితాబ్‌ని కోరినా.. ఇది దేశభక్తితో పాడుతున్నానంటూ తిరస్కరించారని సౌరవ్ వివరించారు.