: పార్టీ ఫిరాయింపుపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ పక్క తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధమవుతుండగా మరో వైపు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న సాయంత్రానికల్లా తమ వాదనను తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. బల నిరూపణకు ఈనెల 28 వరకు సీఎం రావత్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ గడువు విధించారు. ఈ విషయమై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీహార్‌లో ఘోర ఓటమి తర్వాత భాజపా కొత్త పాలిటిక్స్ అనుసరిస్తోందంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ అంశమై ప్రజాస్వామ్య విలువలపై తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలు గల ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్-36, బీజేపీ-28, బీఎస్‌పీ-02, ఇతరులు-4 స్థానాలను కలిగిఉన్నారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారడంతో ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే.