: రోజాకు షాక్!... సస్పెన్షన్ కరెక్టే... అలవెన్సులు కూడా నిలిపేయండంటూ ప్రివిలేజ్ కమిటీ సిఫారసు
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన రోజాకు ఎమ్మెల్యే హోదాలో అందుతున్న అలవెన్సులను కూడా నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ శాసనసభకు సిఫారసు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సభకు కమిటీ తన నివేదికను అందజేసింది. టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు సభా నియమాలకు విఘాతమేనని తేల్చి చెప్పిన కమిటీ, రోజాపై సస్పెన్షన్ కరెక్టేనంటూ చెప్పింది. అంతేకాకుండా ఇప్పటిదాకా రోజాకు అందుతున్న అలవెన్సులను నిలిపివేసి కఠినంగా వ్యవహరించాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది. తమ ముందు హాజరుకావాలన్న నాలుగు నోటీసులకు రోజా అసలు స్పందించలేదని కూడా కమిటీ పేర్కొంది. ఇక సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)పై చర్యల విషయాన్ని సభకే వదిలేస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చిన మేరకే కొడాలి నానిపై కమిటీ కాస్తంత మెతక వైఖరి అవలంబించిందన్న వాదన వినిపిస్తోంది.