: ప్రివిలేజ్ కమిటీ ముందు వైఎస్సార్సీపీ నేతలు ఏం చెప్పారంటే...!
గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తానెప్పుడూ పరిధులు దాటి వ్యాఖ్యలు చేయలేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ లో కూడా హద్దులు దాటి మాట్లాడనని, ఒకవేళ మాట్లాడానని నిరూపిస్తే ఏ చర్యలు తీసుకున్నా వాటిని శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కొడాలి నాని మాట్లాడుతూ, తాను మంత్రి అచ్చెన్నాయుడిపై పరుష పదజాలం ఉపయోగించిన సంగతి వాస్తవమేనని అంగీకరించానని చెప్పారు. సైకోలు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నప్పుడు... మౌనంగా ఎలా ఉంటామని ఆయన చెప్పారు. ఆ తరువాత క్షమాపణలు కూడా చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేం చెబుతారని కమిటీ అడిగిందని, ఇప్పుడు కూడా అదే చెప్పానని ఆయన తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ, శాసనసభలో చర్చ సందర్భంగా కొన్నిసార్లు పరుష పదజాలం వినియోగించి ఉంటానని అన్నారు. వాడీవేడి చర్చ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆవేశంలో మాట్లాడి ఉంటానని చెప్పానని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని ప్రివిలేజ్ కమిటీకి తెలిపానని చెవిరెడ్డి తెలిపారు.