: అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా జగన్... అంబులెన్స్ లో ఆసుపత్రికి రోజా
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన తనను అడ్డుకున్న పోలీసుల వైఖరికి నిరసనగా నడిరోడ్డుపై దీక్షకు దిగిన రోజా నీరసించి ఆసుపత్రికి చేరారు. గంటకు పైగా ఎండలో ఫుట్ పాత్ పై కూర్చున్న రోజా... నీరసించి అక్కడే వస్త్రాన్ని పరుచుకుని పడుకుండిపోయారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రోజాను పరామర్శించారు. ఆ తర్వాత జగన్ సూచనతో రోజా అంబులెన్స్ ఎక్కారు. తదనంతరం అంబులెన్స్ నేరుగా నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు రోజా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నీరసించిన రోజాను ఆసుపత్రికి పంపిన జగన్... తన ఎమ్మెల్యేలతో కలిసి అధికార పార్టీ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలుదేరారు.