: లంక కూడా బోణీ కొట్టేసింది!... ఆఫ్ఘన్ పై ఘన విజయం
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కూడా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో బోణీ కొట్టింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై లంక జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక స్టార్ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అఫ్ఘన్ కుదేలైపోయింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక... ఇంకో 7 బంతులు మిగిలి ఉండగానే 154 పరుగులు చేసి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. దిల్షాన్ 56 బంతుల్లోనే 83 పరుగులు చేసి లంక విజయంలో కీలక భూమిక పోషించాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడిన దిల్షాన్... ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశాడు. దిల్షాన్ తో జతకలిసిన కెప్టెన్ మాథ్యూస్ కూడా (21) చెలరేగడంతో లంక విజయం నల్లేరుపై నడకలా సాగింది.