: ప్రణబ్ తర్వాత అమితాబ్ రాష్ట్రపతి అయితే సంతోషిస్తా: శత్రుఘ్ను సిన్హా
బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా.. కాబోయే భారత రాష్ట్రపతిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబ్ రాష్ట్రపతి అయితే తాను చాలా సంతోషిస్తానని బీజేపీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా అన్నారు. కల్చరల్ ఐకాన్ బిగ్ బీ భారత్‌కు ప్రెసిడెంట్ అయితే చాలా గర్వకారణమని వ్యాఖ్యానించారు. సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో అమితాబ్ ఎన్నో మైలురాళ్లను అధిగమించారని ఆయన అన్నారు. బిగ్‌బీ ప్రెసిడెంట్ అయితే దేశానికి చాలా మంచి పేరు వస్తుందన్నారు. కాగా, గతంలో వీరిరువురూ పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఆ మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. అభిషేక్ బచ్చన్ పెళ్లికి శత్రుఘ్ను సిన్హాకు ఆహ్వానం అందలేదు. ఆ సందర్భంగా తనకు పంపించిన స్వీట్లను సిన్హా తిప్పి పంపించారు. తాజాగా, దేశాధ్యక్ష పదవికి అమితాబ్ గతంలో తన పేరును ప్రతిపాదించారని శత్రుఘ్ను సిన్హా అన్నారు. అయితే ఇప్పుడు శత్రుఘ్ను సిన్హా మాత్రం కాబోయే రాష్ట్రపతిగా అమితాబ్ పేరును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎంపీ తాజా వ్యాఖ్యలపై కూడా సిన్హా స్పందించారు. భారత్ మాతాకీ జై అని నినదించడం, వందేమాతరం ఆలపించడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.