: ఈనెల 27న భారత్‌కు పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం... పఠాన్‌కోట్ దాడిపై విచారణ
పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై విచారణ జరిపేందుకు పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నెల 27న భారత్‌కు రానుంది. ఈ విషయమై పాక్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్‌కు ఇప్పటికే భారత్ వీసా జారీ చేసింది. నేపాల్‌లోని పొఖారాలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, సర్తాజ్ అజీజ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సీమాంతర ఉగ్రవాదం, ఇరు దేశాల మధ్య చెలరేగుతోన్న సమస్యలపై చర్చించారు. సమావేశం అనంతరం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడిపై విచారణ జరిపేందుకు పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నెల 27న భారత్‌కు రానుందని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఉమ్మడి ప్రకటన చేశారు. సదరు ఇన్వెస్టిగేషన్ టీం ఈ నెల 28 నుంచి విచారణ ప్రారంభించనుంది. భారత్ - పాక్ ప్రధానులు త్వరలో అమెరికాలో కలుసుకునే అవకాశం ఉందని సర్తాజ్ అజీజ్ తెలిపారు. సుష్మాస్వరాజ్ తన ముందుంచిన అంశాలన్నిటిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సర్తాజ్ అజీజ్ చెప్పారు. పఠాన్ కోట్ దాడి(జనవరి2) అనంతరం మొదటిసారిగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అధికారికంగా సమావేశమయ్యారు.