: 'తార'స్థాయికి వివాదం.. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ పరస్పరం నోటీసులు
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఇద్దరు తారలూ పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకునే వరకు వెళ్లింది. రెండు నెలల క్రితం హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' గా కామెంట్ చేయడం, దానికి హృతిక్ ఘాటుగా స్పందించడం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ తాజాగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. నేనేం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో కానీ కంగనా కూడా లీగల్ నోటీసులతో బదులిచ్చింది. లీగల్ నోటీస్‌లో హృతిక్ ఏమని చెప్పాడో తెలుసా..? "కంగనా.. అస్పర్జెర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నదని, దీంతో రోజుకు 50కిపైగా ఈమెయిల్స్ పంపి, తనను వెంటాడింద"ని పేర్కొన్నాడు. ఆమె మొత్తంగా 1,439 ఈమెయిల్స్ పంపిందని తెలిపాడు. అయితే, కంగనా ముల్లుని ముల్లుతోనే తీయాలనుకుందేమో.. హృతిక్ పంపిన లీగల్ నోటీసుకి మరో లీగల్ నోటీస్తోనే సమాధానమిచ్చింది. కంగానా ఇచ్చిన లీగల్ నోటీసులో ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. కంగనా మాత్రం తన అకౌంట్‌ను హృతిక్ హ్యాక్ చేసి.. తన విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్ అన్నీ డిలీట్ చేశాడని ఆరోపించింది. దీనిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.