: భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ వర్గాల్లో ఆగ్రహం
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈ నెల 19న కోల్ కతాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను వీక్షించేందుకు పాకిస్థాన్ దేశానికి చెందిన ఏడుగురు దౌత్యవేత్తలకు అనుమతి నిరాకరించడం ఆ దేశ వర్గాలకు రుచించడం లేదు. భారత నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత నిర్ణయం ఆమోదనీయం కాదని ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హై కమీషనర్ జేపీ సింగ్ కు పాక్ అధికారికంగా నిరసన తెలియజేయనుంది. ఏడుగురు దౌత్యవేత్తలలో ఐదుగురికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్నందునే వారికి అనుమతి నిరాకరించినట్టు భారత్ వర్గాలు అంటున్నాయి. ఆ ఐదుగురినే భారత్ లో అడుగుపెట్టకుండా అడ్డుకున్నట్టు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ ఏడుగురు బుధవారం భారత్ కు రావాల్సి ఉంది. అయితే, వారిలో ఒక్కరికి కూడా మంగళవారం సాయంత్రం వరకు కూడా అనుమతి రాలేదని పాక్ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్, పాక్ జట్ల మధ్య 19వ తేదీ జరగనున్న మ్యాచ్ చూసేందుకు 45 మంది తరఫున పాక్ అనుమతి కోరింది.