: మరోసారి పోరాటానికి సిద్ధం... జాట్ల హెచ్చరిక
తమ డిమాండ్లను మార్చి 17లోపు పరిశీలించకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామని హర్యానాలోని జాట్ వర్గ నాయకులు హెచ్చరించారు. ఈ విషయమై మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం స్పందించకపోతే మార్చి17న తమ ఉద్యమ కార్యచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రోడ్ల నిర్బంధం, రైల్వే ట్రాక్‌ల వద్ద నిరసన...ఇలా ఏ రూపంలోనైనా ఆందోళన కొనసాగించడంపై చర్చించనున్నామని ఆల్ ఇండియా జాట్ మహాసభ చీఫ్ యశ్ పాల్ మాలిక్ చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని జాట్ నాయకులు నిర్ణయించారని, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిర్వహిస్తామని యశ్ పాల్ మాలిక్ పేర్కొన్నారు. తమ నిరసనను శాంతియుతంగా నిర్వహిస్తున్నా ప్రభుత్వం తమపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అణచివేయాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. మంత్రులు జాట్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను ప్రభుత్వం అదుపు చేయాలని కోరారు. జాట్ల రిజర్వేషన్‌పై రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమను ఓబీసీ కేటగిరీలో చేర్చాలంటూ హర్యానాలో జాట్ వర్గానికి చెందిన వేలాది మంది ఇటీవలే రోడ్డెక్కి చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.