: స్పీకర్ పై అవిశ్వాసంలో ఓడిపోయిన వైకాపా
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానంపై దాదాపు మూడు గంటల చర్చ అనంతరం, వైకాపా ఓటింగుకు పట్టుబట్టడంతో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాలని సూచిస్తే, వైకాపా తరఫున సభలో ఉన్న 57 మంది లేచి నిలుచున్నారు. ఆ తరువాత వ్యతిరేకంగా ఉన్న వారిని లేచి నిలబడాలని సూచించగా, తెలుగుదేశం, బీజేపీలకు చెందిన 97 మంది లేచి నిలబడ్డారు. తటస్థంగా ఉన్నవారు ఎవరూ లేరు. దీంతో తీర్మానం 47 ఓట్ల తేడాతో వీగిపోయిందని బుద్ధప్రసాద్ ప్రకటించారు. దీంతో తన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలన్న జగన్ పాచిక పారకుండా పోయింది.