: పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చా!... చంద్రబాబు సర్కారుపై బీజేఎల్పీ నేత చురక
మిత్రపక్షం టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు నిరసన గళమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న బీచ్ శాండ్ తరలింపుపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని ట్రైమెక్స్ కంపెనీ అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలా లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కలకలం రేపిన 2జీ స్కాం కన్నా బీచ్ శాండ్ కుంభకోణం అతిపెద్దదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సర్కారుకు చురకలు వేస్తూ ‘నేను ఈరోజు పసుపు రంగు చొక్కా వేసుకొచ్చా’ అని ఆయన అన్నారు. బీచ్ శాండ్ స్కాంపై చర్చ సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు లేకపోవడం దురదృష్ణకరమని ఆయన నిరసన వ్యక్తం చేశారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలతో అధికార టీడీపీ సభ్యులు కాస్తంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.