: పెళ్లి ముందు రోజున కూతురిని అలా చూసి... హత్యచేసిన కన్న తల్లి!


మరో 24 గంటల్లో ఆ ఇంట వివాహం. అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇంటినిండా బంధువులు వచ్చేశారు. కూతురికి ఓ మంచి వ్యాపారవేత్తతో వివాహం జరగనుందన్న ఆనందంలో ఉన్న ఆ తల్లి తన చేతులతో స్వయంగా కన్న కూతురిని హత్య చేసింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, భర్త మరణానంతరం మీరట్ కు చెందిన ఓ మహిళ కొడుకు, కూతురితో కలసి ఢిల్లీలో ఉంటోంది. తన కుమార్తెకు ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహాన్ని కుదుర్చుకుంది. పెళ్లి ముందు రోజున ఆమె బయటకు వెళ్లి వచ్చేసరికి, ఇంట్లో అద్దెకున్న వ్యక్తితో కుమార్తె సన్నిహితంగా మెలగుతూ కనిపించింది. ఆ వ్యక్తి పారిపోగా, ఆగ్రహంతో కుమార్తె ముఖంపై బలంగా దిండును అదిమి హత్య చేసింది. ఆపై కొడుకును పిలిచి విషయం చెప్పింది. అతడు తల్లికి మద్దతుగా నిలిచాడు. గుండెపోటు వచ్చినందున ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని బంధువులకు చెప్పి మృతదేహాన్ని లోక్ నాయక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నం చేసినట్టు అక్కడి వైద్యులకు తెలిపారు. అనుమానం వచ్చిన డాక్టర్లు, పోలీసులకు సమాచారం ఇస్తే, మొత్తం విషయం బయటకు వచ్చింది. మృతురాలికి, అదే ఇంట్లోని ఓ పోర్షన్ లో అద్దెకుండే వ్యక్తికి చాలా రోజులుగా అక్రమ సంబంధం ఉందని వెల్లడించిన పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News