: కేసు, కౌన్సిలింగే మాపని... పెళ్లంటే ఎలా?: ఇబ్బంది పెడుతున్న యువతికి బంజారాహిల్స్ పోలీసుల మొర!
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఓ యువతి పోలీసుల చుట్టూ తిరుగుతుండగా, తాము చీటింగ్ కేసు మాత్రమే పెట్టగలమని, వివాహం తమ పని కాదని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ కు చెందిన ఓ యువతి, మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో వరుడి కోసం వెతుకుతూ, ఎన్ విజయ్ దీప్ అనే బ్యాంకు మేనేజర్ కు పరిచయం అయింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా. ఆపై పెళ్లికి తేదీ కూడా ఫిక్సయిన తరువాత, ఆమె తనకు సరిపడదంటూ విజయ్ వివాహానికి నిరాకరించాడు. ఆపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా, చీటింగ్ కేసు పెట్టిన వారు విజయ్ ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిలు తీసుకున్న విజయ్ జైలు నుంచి బయటకు రాగా, అతనితోనే పెళ్లిని కోరుకుంటున్న యువతి మాత్రం స్టేషన్ ను వీడటం లేదు. తాము కేసు పెట్టగలం, కౌన్సెలింగ్ చేయగలమే తప్ప పెళ్లి చేయించలేమని పోలీసులు స్పష్టం చేస్తున్నా ఆమె పట్టు వీడలేదు. ఈ క్రమంలో స్టేషన్ ముందు బైఠాయించిన బాధితురాలు నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో తమకేమీ పాలుపోవడం లేదని పోలీసులు వాపోతుండటం కొసమెరుపు.