: రాంరెడ్డికి కేన్సరంటే నమ్మలేకపోయా: కేసీఆర్
స్వతహాగా మృదుస్వభావి, మితభాషి అయిన కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు కేన్సర్ సోకిందని తెలిసి నమ్మలేకపోయానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో వెంకటరెడ్డి మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కేసీఆర్ మాట్లాడారు. ఆయనకున్న పందెం ఎడ్లు తనకు ఎంతో నచ్చేవని, ఎక్కడ పోటీలు జరిగినా అవే బహుమతులు గెలుచుకునేవని గుర్తు చేసుకున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు పశువుల పోషణ, వ్యవసాయంలో ఎంతో నైపుణ్యముందన్నారు. ఆయనకు కేన్సర్ సోకిన తరువాత, వైద్య ఖర్చులను ప్రభుత్వం తరఫున ఇచ్చామని వెల్లడించిన కేసీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు.