: ఏఐ విమానంలో గొడవపడి వీఐపీలకు చుక్కలు చూపిన సిబ్బంది!
అది ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం. అందులో సీపీఎం నేత ప్రకాష్ కారత్ తో పాటు ముగ్గురు ఎంపీలు, 16 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. విమాన సిబ్బంది కారణంగా వారందరికీ చుక్కలు కనిపించాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిన్న సాయంత్రం 5:45కు ఢిల్లీ విమానాశ్రయం టర్మినల్-3 నుంచి బయలుదేరాల్సిన విమానంలోకి పది నిమిషాల ముందుగానే అందరూ ఎక్కేశారు. మరో ఐదు నిమిషాల్లో టేకాఫ్ తీసుకోవాల్సిన సమయంలో విమాన సిబ్బంది మధ్య గొడవ ప్రారంభమైంది. గొడవ ఎందుకు మొదలైందో తెలియదు కానీ, రాత్రి 8 గంటల వరకూ విమానం కదల్లేదు. "బోర్డింగ్ అయిపోయింది. ఫ్లయిట్ టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో సిబ్బంది గొడవ పడ్డారు. వారి గొడవను ఎంపీలు, అధికారులు సహా అందరూ చూశారు. వారి గొడవతో గంటల కొద్దీ ఆలస్యం అయింది. వారు విమానాన్ని టేకాఫ్ కానీయలేదు, మమ్మల్ని దిగనీయలేదు" అని ఎంపీ ఎన్ కే ప్రేమచంద్రన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో లేవదీయనున్నట్టు మరో ఎంపీ తెలిపారు. ఈ గొడవతో విమానం రెండు గంటల ఆలస్యంగా 7:46కు టేకాఫ్ అయింది. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహానీ స్పందించారు. క్రమశిక్షణా ఉల్లంఘనను, ప్రయాణికులను ఇబ్బంది పెట్టే వారిని ఉపేక్షించబోమని, ఇద్దరు విమాన సిబ్బందిని సస్పెండ్ చేశామని వెల్లడించారు.