: సూర్యగ్రహణం వీక్షించేందుకు విమానం దారి మళ్లింపు
సూర్యగ్రహణ మార్గం, విమానం పయనించే మార్గం కలుస్తాయన్న సూచనల మేరకు అలస్కా ఎయిర్ లైన్స్ అధికారులు తమ విమానం దారిని స్వల్పంగా మళ్లించారు. దీంతో నిన్న సంభవించిన సూర్యగ్రహణాన్ని సుమారు 163 మంది ప్రయాణికులు వీక్షించేలా చేసి, జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతిని అలస్కా ఎయిర్ లైన్స్ వారికి మిగిల్చింది. అలస్కాలోని యాంకరేజ్ నుంచి హవాయికి వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఈ అరుదైన అవకాశం లభించింది. నిన్న తెల్లవారు జామున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ దృశ్యాన్ని విమానంలో నుంచి ప్రయాణికులు చూసేలా ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్లాన్ చేశారు. విమాన ప్రయాణికుల్లో ఒకరైన జోసెఫ్ రావ్..అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీస్ హైడెన్ ప్లానిటోరియానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. సూర్యగ్రహణం సంభవించే మార్గం, వారు ప్రయాణించే విమానం మార్గం ఒకటేనని అలస్కా ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఆయనే తెలిపారు. ఈ సూచనను ఎయిర్ లైన్స్ సిబ్బంది పాటించారు. కాగా, సూర్యగ్రహణం దృశ్యాలను విమాన సిబ్బంది తమ వీడియోలో షూట్ చేశారు. ఆ వీడియోతో పాటు సూర్య గ్రహణ ఫొటోలను కూడా అలస్కా ఎయిర్ లైన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 35,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందుగానే చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. అయితే, సూర్య గ్రహణం వీక్షించేందుకని విమానాన్ని దారి మళ్లించడం కారణంగా సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా నడపాల్సి వచ్చిందని సమాచారం.