: కన్నయ్య కుమార్ కు యోగేశ్వర్ దత్ మరో పంచ్!
దేశద్రోహం కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన జేఎన్ యూ స్టూడెంట్ నాయకుడు కన్నయ్య కుమార్ ను ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ మరోసారి ప్రశ్నించాడు. గతంలో కన్నయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు చేశాడంటూ వీడియోలు వెలుగుచూసినప్పుడు యోగేశ్వర్ దత్ ఆగ్రహంతో కవితను రాశాడు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురు దేశభక్తుడైతే దేశరక్షణ కోసం సియాచిన్ లో ప్రాణాలు విడిచిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఎవరు? అని ఆయన ప్రశ్నించాడు. అనంతరం...జైలు నుంచి విడుదలైన తరువాత తన విషయంలో మీడియా దేశ ప్రజలను తప్పుదోవపట్టించిందని కన్నయ్య కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు హెచ్ సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల ఆదర్శమని చెప్పిన కన్నయ్య కుమార్, అఫ్జల్ గురు భారతీయుడేనని అన్నారు. ఇక తాను దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండానే చేశానని వీడియోలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు... జమ్మూకాశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో భారత జవాన్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారని, వాటిని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదని, వాటిపై మీడియా సంస్థలు ఎందుకు వార్తలు రాయడం లేదని కన్నయ్య కుమార్ ప్రశ్నించారు. దీంతో కన్నయ్య కుమార్ మరోసారి వివాదానికి కేంద్రమయ్యారు. ఈ నేపథ్యంలో, యోగేశ్వర్ దత్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాముకు పాలుపోసి పెంచితే...ఆ పాము మన వీరజవాన్లపై విషం వెదజల్లుతోందని అన్నాడు. అమర జవాన్లపై ఆరోపణలు గుప్పిస్తున్నారని యోగేశ్వర్ దత్ మండిపడ్డాడు.