: 2017 వరకు రెస్ట్... 2019 ఎన్నికల్లో 95 సీట్లు గెలుస్తాం: కోమటిరెడ్డి వ్యాఖ్య
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని విస్మయానికి గురిచేశాయి. 2017 వరకు తామంతా రెస్ట్ లో ఉంటామని చెప్పిన ఆయన 2018లో తిరిగి కార్యక్షేత్రంలోకి దిగుతామని ప్రకటించారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా 95 స్థానాలను గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక తమ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించిన కోమటిరెడ్డి... వచ్చే ఎన్నికల దాకా జగదీశ్ రెడ్డి మంత్రిగానే ఉంటే, నల్లగొండ జిల్లాలోని మొత్తం 15 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని ఆయన జోస్యం చెప్పారు.