: సుష్మా స్వరాజ్ ను పొగిడిన విపక్షాలు... చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు చెప్పిన సుష్మా
నిత్యమూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ, ఉప్పూ నిప్పులా ఉండే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల మధ్య అరుదైన ఘటన చోటు చేసుకుంది. విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ను ఆప్ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తగా, సుష్మా తన వినమ్రతను ప్రదర్శించారు. "మన దేశ ప్రజలు విదేశాల్లో ఇబ్బందులు పడ్డ వేళ, సుష్మా చూపిన చొరవ అభినందనీయం. అందుకామెకు కృతజ్ఞతలు చెబుతున్నా" అని ఎంపీ భగవంత్ మాన్ లోక్ సభలో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి చెందిన 13 మంది సౌదీలో బానిసలుగా బతుకుతూ ఇబ్బందులు పడుతున్న వేళ, సమస్యను ఆమె దృష్టికి తీసుకెళితే, స్పందిన తీరు అద్భుతమని ఆయన పొగిడారు. మరో ఆప్ ఎంపీ ధరమ్ వీర్ గాంధీ సైతం ఆమె చర్యలను కొనియాడారు. "నేను మిమ్మల్ని ఏ ప్రశ్నా అడగబోను. అవసరం వచ్చినప్పుడు ఆమె తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు చెప్పేందుకే లేచాను. పంజాబ్ ప్రజలకు ఆమె ఎంతో చేస్తున్నారు" అన్నారు. ఓ మంత్రిగా సుష్మా స్పందించే తీరు అత్యద్భుతమని బిజూ జనతాదళ్ నేత బైజయంత్ పాండా వ్యాఖ్యానించగా, ఆర్జేడీ సభ్యుడు రాజేష్ రంజన్ మాట్లాడుతూ, ప్రశ్నలు ఇంగ్లీషులో వేసినా, ఆమె హిందీలో సమాధానం చెప్పడం ముదావహమని అన్నారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ, "కృతజ్ఞతలు తప్ప ప్రశ్నలే లేవా?" అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వీరందరి పొగడ్తల వర్షానికి ఉబ్బితబ్బిబ్బయిన సుష్మా, తనను అభినందిస్తున్న వారికి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.