: గూగుల్ సెర్చ్.. భారత్ లో మహిళలదే పైచేయి
ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటున్న మహిళలు తాజాగా ఇంటర్నెట్ వినియోగంలోనూ తమ సత్తా చాటారు. భారత్ లో మహిళలే ఎక్కువగా ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, అందం, ఫ్యాషన్ తదితర అంశాలకు సంబంధించి ‘గూగుల్’ సెర్చ్ ఎక్కువగా చేస్తున్నది మహిళలేనట. ఈ విషయాన్ని ప్రముఖ సెర్ఛ్ ఇంజన్ గూగుల్ సంస్థ పేర్కొంది. అలాగే, మహిళల్లో ఏ వయస్సు వారు ఆయా అంశాలకు సంబంధించి ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ‘గూగుల్’ వెల్లడించింది. ముఖ్యంగా 35 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు ‘గూగుల్’ సెర్చ్ చేస్తున్నారని పేర్కొంది. 2014తో పోలిస్తే 2015లో ‘గూగుల్’ సెర్చ్ చేస్తున్న మహిళల శాతం బాగా పెరిగిందిట. 15-35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలతో పోలిస్తే 55 ఏళ్లకు పైబడిన మహిళల్లో గూగుల్ సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.