: ఎంపీల్యాడ్స్ పెంపునకు గ్రీన్ సిగ్నల్!... జైట్లీ సానుకూలం, నిర్ణయమే తరువాయి


పార్లమెంటు సభ్యులు తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న నిధుల (ఎంపీల్యాడ్స్) పరిమితి పెంపునకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ప్రతి ఎంపీకి ఈ కోటా కింద ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. అయితే ఈ నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ సుభాష్ భామ్రే ఆవేదన వ్యక్తం చేశారు. తన రాష్ట్రంలోని ఒక్కో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల మేర నిధులు కేటాయిస్తున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికే ఏడాదికి రూ.2 కోట్లు విడుదల చేస్తుంటే, ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న లోక్ సభ నియోజకవర్గాలకు రూ.5 కోట్లు ఎలా సరిపోతాయని కూడా ఆయన ప్రశ్నించారు. భామ్రే ప్రతిపాదనకు మిగిలిన ఎంపీల మద్దతు కూడా తోడైంది. ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించిన ప్రధాని మోదీ, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సూచించారట. దీంతో దీనిపై కసరత్తు చేసిన జైట్లీ ఎంపీల్యాడ్స్ కోటాను పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News