: మంత్రిగా మారేదెప్పుడన్న మీడియా... ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానన్న భూమా
వైసీపీలో కీలక నేతగానే కాక ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి... పీఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇక వైసీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ మారే క్రమంలో కేబినెట్ హోదా, పలు కేసుల నుంచి ఉపశమనం తదితర తాయిలాలతోనే భూమా నాగిరెడ్డి తన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ‘సైకిల్’ ఎక్కేశారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా భూమాను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ‘పార్టీ మారారు. మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వేగంగానే స్పందించిన భూమా ‘‘ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నాను. అయితే ఆ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు’’ అని బదులిచ్చారు. ఇక తన సొంత జిల్లా కర్నూలు నుంచి ఇంకెవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సరదా సమాధానమిచ్చారు. ‘‘మీరు ఎవరైనా జాబితా ఇస్తే, వారిని పార్టీలో చేర్చేందుకు యత్నిస్తా’’ అంటూ భూమా చెప్పడంతో అక్కడ నవ్వులు విరిశాయి.