: టీ టీడీఎల్పీ వ్యూహాత్మక భేటీకి రేవంత్ ఒక్కరే హాజరు!... గులాబీ గూటి వైపు ‘సండ్ర’ అడుగులు?


ఈ నెల 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి చర్చించేందుకు టీ టీడీఎల్పీ భేటీని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించారు. ఈ భేటీకి పాలమూరు జిల్లా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అదేంటీ, ఆ పార్టీలో ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారుగా? ఒక్కరు రావడమేంటనేగా మీ సందేహం? గడచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్లపై 15 మంది గెలవగా, ‘ఆపరేషన్ ఆకర్ష్’ను చేపట్టిన టీఆర్ఎస్ వారిలో పది మందిని లాగేసింది. ఇక ఐదుగురు మాత్రమే ఉన్నారు. వీరిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మొన్న ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కూడా అయ్యారు. మాగంటితో పాటు అరికెపూడి గాంధీ కూడా కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో రేవంత్ రెడ్డిని లాగేయడం టీఆర్ఎస్ సహా ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాదు. మరో ఇద్దరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలే. ఆర్.కృష్ణయ్య కూడా దాదాపుగా టీఆర్ఎస్ లో చేరడం అసాధ్యమే. ఇక ఓటుకు నోటు కేసులో ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన సండ్రను తాము పార్టీలో చేర్చుకోమంటూ గతంలో టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో సండ్రకు కూడా టీఆర్ఎస్ స్వాగతం పలికేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాగంటి, అరికెపూడిలతో పాటు సండ్ర కూడా ఈ నెల 11న టీఆర్ఎస్ లో చేరడం ఖాయమన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. నిన్నటి వ్యూహాత్మక భేటీకి హాజరుకాలేని పరిస్థితికి సండ్ర చెప్పిన కారణమే ఈ పుకార్లకు కారణంగా వినిపిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల నేపథ్యంలో తాను సమావేశానికి హాజరుకాలేనని ఆయన పార్టీ అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. అయితే ఖమ్మం కార్పొరేషన్ కు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. అంతేకాక నేటి ఉదయం అక్కడ కౌంటింగ్ కూడా మొదలైంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో ఉండి సండ్ర చేసే పనేమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘గోడ’ దూకేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలోనే సండ్ర భేటీకి హాజరుకాలేదన్న భావన వ్యక్తమవుతోంది. సండ్ర కూడా కారెక్కితే... ఇక తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పడిపోనుంది. ఇక తన సామాజిక వర్గానికి చెందిన సమస్యలపై పోరు సాగిస్తున్న ఆర్.కృష్ణయ్య పార్టీ కార్యక్రమాల్లో అంత ఉత్సాహంగా పాల్గొనడం లేదు. దీంతో టీడీపీ తరఫున అసెంబ్లీలో పోరు సాగించే ఏకైక వ్యక్తిగా రేవంత్ రెడ్డి మాత్రమే మిగలనున్నారు.

  • Loading...

More Telugu News